శాఖల అభివృద్ధి పనులలో ఖచ్చితంగా పురోగతి కనపర్చాలి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.

కర్నూలు బ్యూరో ఫిబ్రవరి 09:- వివిధ శాఖలు చేపడుతున్న అభివృద్ధి పనులలో ఖచ్చితంగా పురోగతి కనపర్చాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
సోమవారం ముఖ్యమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చిలో జరిగే కలెక్టర్ల సమావేశం నాటికి అన్ని విభాగాల్లో అభివృద్ధి కనిపించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ బాగుందని, అయితే జాబ్ మేళాల ద్వారా కనీసం 7,000 నుండి 8,000 మందికి ఉపాధి కల్పించే విధంగా లక్ష్యంగా నిర్దేశించుకోవాలన్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సమస్యల పరిష్కారంలో పూర్తి స్థాయిలో పురోగతి కనిపించాలన్నారు. సాంఘిక, గిరిజన, మైనార్టీ, బీసీ తదితర సంక్షేమ వసతి గృహాల్లో టాయిలెట్లు, తాగునీరు కోసం నిధులు మంజూరు చేస్తామని, వెంటనే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ ని ఆదేశించారు. వసతి గృహాల్లో మెనూ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గర్భిణీలు, బాలింతలు మరియు 0-6 ఏళ్ల పిల్లలకు అందించే సేవలలో ప్రజల సానుకూల స్పందన పెరగాలని ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. గతంలో ‘మాస్ డ్రైవ్’ ద్వారా 85 బాల్య వివాహాలను ఆపగలిగారని, అదే రీతిలో పని చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్య వివాహాలు జరగకుండా ఆపాలన్నారు. డి.ఆర్.డి.ఏ, సోషల్ వెల్ఫేర్, బి.సి వెల్ఫేర్, అగ్రికల్చర్, డిఈఓ, తదితర అన్ని విభాగాలలో ప్రజల నుండి సానుకూల స్పందన పెరగాలన్నారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే,పి4, బయోమెట్రిక్ అప్డేషన్, ఇ-కెవైసి తదితర 5 పారామీటర్స్లో వెనుకబడి ఉన్నారని, పురోగతి తీసుకొని రావాలని కలెక్టర్ జిల్లా పరిషత్ సీఈఓ ను ఆదేశించారు.తాగునీటి సరఫరాలో లీకేజీలు, మరమ్మతులు సిఎస్ఆర్ నిధుల వినియోగంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ ని ఆదేశించారు. నీటి సరఫరాలో పొరపాట్లు చేస్తే సంబంధిత సిబ్బందిని వెంటనే తొలగిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. హౌసింగ్ విభాగంలో పి.ఎం.ఏ.వై 1 మరియు 2 పథకాల కింద పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. పెన్షన్ల పంపిణీలో జిల్లా ర్యాంకింగ్ ను మెరుగుపరచాలన్నారు. వరి సాగును తగ్గించి, ఉద్యానవన పంటలు మరియు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ వ్యవసాయ అనుబంధ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, హౌసింగ్ పిడి చిరంజీవి, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



