భార్యను మోసం చేసి రెండో పెళ్లి..కులం పేరుతో వేధింపులు
నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించిన స్పెషల్ ఎస్సీ,ఎస్టీ కోర్టు

రాయచోటి, ఫిబ్రవరి 9 :
భార్యను మోసం చేసి రెండో పెళ్లి చేసుకోవడంతో పాటు కులం పేరుతో వేధింపులకు గురి చేసిన నిందితుడికి ఏడు సంవత్సరాల కారాగార శిక్షతో పాటు రూ.4 వేలు జరిమానా విధిస్తూ సోమవారం కడప నాలుగవ అదనపు జిల్లా జడ్జి కోర్టు(ఎస్సీ ఎస్టీ కోర్టు) న్యాయమూర్తి దీనబాబు సంచలన తీర్పునిచ్చారు.పోలీసుల కథనం మేరకు వివరాలలోకి వెళితే
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పర్యవేక్షణలో పకడ్బందీగా విచారణ చేపట్టడంతో బాధితురాలికి న్యాయం దక్కింది.అమాయక మహిళను పెళ్లి పేరుతో మోసం చేసి,కట్నం కోసం వేధిస్తూ,కులం పేరుతో దూషించిన నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది.అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం పరిధిలోని సంబేపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసులో నిందితుడు బుస్సా వెంకటేశ్వర్లుకు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.4 వేలు జరిమానా విధిస్తూ కడప నాలుగవ అదనపు జిల్లా జడ్జి కోర్టు న్యాయమూర్తి దీనాబాబు తీర్పునిచ్చారు.సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామానికి చెందిన దేవరింటి రాధ అనే మహిళను పెళ్లి చేసుకున్న బుస్సా వెంకటేశ్వర్లు(41) ఆమెకు తెలియకుండా మరో వివాహం చేసుకున్నాడు.అదనపు వరకట్నం కోసం వేధిస్తూ,కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషిస్తూ బాధితురాలిని మానసిక,శారీరక క్షోభకు గురిచేశాడు.బాధితురాలు 2018 సంవత్సరం జనవరి నెల 6 వ తేదీన సంబేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసును రాయచోటి సబ్ డివిజనల్ పోలీస్ అధికారితో పాటు ఇతర పోలీస్ అధికారులు శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి 7 ఏళ్ల ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా శ్రమించిన అప్పటి,ప్రస్తుత అధికారులను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రత్యేకంగా అభినందించారు.అప్పటి ఏఎస్పీ బి.కృష్ణారావు,ప్రస్తుత డిఎస్పీ యం.ఆర్.కృష్ణ మోహన్,అప్పటి ఎస్ఐ మహమ్మద్ హసం,ప్రస్తుత ఎస్ఐ జి.రవికుమార్,రూరల్ సీఐ ఎస్.కె.రోషన్ ప్రత్యేక దర్యాప్తు ద్వారా చార్జి సీటు వేసి కోర్టులో దాఖలు చేయడంతో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎల్.బాలాజీ, కోర్టు కానిస్టేబుళ్లు ఆర్.అమరనాథ రాజు,వై.విశ్వనాథ్ యాదవ్ లు మానిటరింగ్ చేయడంతో నిందితుడికి జైలు శిక్ష పడింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రతకు జిల్లా పోలీసులు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారని,నేరస్థులు ఎంతటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరని,ఈ తీర్పు ద్వారా స్పష్టమవుతోందని ఎస్పీ పేర్కొన్నారు.బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా ప్రతి కేసులోనూ కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు.




